వళ్ళువర్ కోట్టం

రథం పైభాగంలోని తిరువళ్ళువర్ విగ్రహం
తమిళ ప్రాచీన కవి, తిరుక్కురళ్  సూక్తులు ద్వారా తమిళానికి సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే ఖ్యాతి కల్పించిన తిరువళ్ళువర్ కు గౌరవం కల్పించే విధంగా చెన్నైలో వళ్ళువర్ కోట్టం ను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. నగరంలోని కోడంబాక్కంలోని పెరు తెరు (పెద్ద వీధి), విల్లేజ్ వీధుల కూడలిలో 1976 వ సంవత్సరం దీనిని నిర్మించారు. వి.గణపతి స్తపతి ఆధ్వర్యంలో దీని నిర్మాణ పనులు జరిగాయి. 
రథం



రథం: వళ్ళువర్ కోట్టంలో రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రసిద్ధి చెందిన తిరువారూరు ఆలయం రథం పోలికతోనే దీనిని నిర్మించారు. 128 అడుగులు (39 మీటర్లు) ఎతైన ఈ రథం ఎదుట నల్ల రాతితో చేసిన ఏడు అడుగుల ఎత్తు కలిగిన రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ రథం చక్రాలు ఒక్కొక్కటి 11 .25 అడుగులు ఎత్తు ఉన్నాయి. ఇదే రథం పై భాగంలో 30 అడుగుల  ఎత్తులో తిరువళ్ళువర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఉన్న రథం భాగం మాత్రమే 40 అడుగుల వైశాల్యం కలిగి ఉంది. రథం పక్కనే నిర్మించిన ఆడిటోరియం పై భాగానికి చేరుకుంటే దాని పైనే ఈ తిరువళ్ళువర్ విగ్రహం నిర్మించినట్టు భ్రమ కలుగుతుంది. ఆ విధంగా ఆడిటోరియం, రథాన్ని పక్క పక్కనే నిర్మించారు. రథం కింది భాగంలో తిరుక్కురళ్ పద్యాల భావాలను వివరించే విగ్రహాలు ఉన్నాయి.

ఆడిటోరియం 
ఆడిటోరియం ముందు భాగం
220 అడుగుల ఎత్తు, 100  అడుగుల వెడల్పుతో ఆడిటోరియం నిర్మించారు. ఆడిటోరియం పై భాగానికి వెళ్ళే మార్గంలో 1330  తిరుక్కురళ్ సూక్తులు చెక్కిన నల్ల రాతి పలకలు ఏర్పాటు చేశారు. ఈ చోటుకు కురళ్ మని మాడం అని పెరు పెట్టారు. 
ఆడిటోరియం పై నుంచి రథం పై భాగం
ఆడిటోరియం పై భాగానికి  చేరుకోగానే తిరువళ్ళువర్ విగ్రహం ఉన్న రథం పైకప్పు స్పష్టంగా కనిపించే విధంగా ఆడిటోరియం పైభాగం నేలపై  ప్రత్యేక ఏర్పాటు చేశారు. వళ్ళువర్ కోట్టం ప్రాంగణంలో అందమైన చెట్లు, మొక్కలు ఏర్పాటు చేయటంతో ఈ చోటు ఓ అందమైన పార్కు తరహాలో కూడా భావన కల్పిస్తుంది. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా కాలక్షేపం కోసం ఇక్కడకు వచ్చి సేద తీరుతూ ఉండటంతో ఈ ప్రాంతం నిత్యం  కళకళలాడుతూ  కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి