సెయింట్ థామస్ మౌంట్

ఆలయం ఉన్న సెయింట్ థామస్ మౌంట్
చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంది. క్రైస్తవ రక్షకుడు అయిన ఏసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా  (థామస్) చనిపోయింది ఇక్కడే కావటం అందుకు కారణం. ఏసు క్రీస్తు పునర్థానం (మరణించిన తర్వాత మళ్ళీ బతకటం) తర్వాత క్రైస్తవ మత వ్యాప్తి కోసం ఆయన శిష్యులు తలో దిక్కుకు వెళ్ళగా తోమా  మాత్రం పలు దేశాల్లో పర్యటించి క్రీస్తు శకం  52 - 72  మధ్య  కాలంలో చెన్నై చేరుకున్నాడు. ఇక్కడి మైలాపూరులో క్రైస్తవ మత వ్యాప్తికి కృషి చేశాడు. అయితే అప్పట్లో హిందు మతం వేళ్ళూనుకొని ఉండటంతో పలువురి ద్వేషానికి అయన గురైయ్యాడు. దీంతో ప్రస్తుతం 'చిన్న మలై' గా పిలుస్తున్న ప్రాంతానికి వచ్చి ఓ గుహలో ఆయన నివశించాడు. ఇక్కడ ఆయనపై హత్యా ప్రయత్నం జరగటంతో చిన్న మలై నుంచి తప్పించుకొని మూడు కిలో మీటర్ల ఆవల ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అక్కడ ఆయన్ను బల్లెంతో పొడిచి చంపారు.

ఆలయ నిర్మాణం

సెయింట్ థామస్ మౌంట్ ఆలయం
పూర్వం ఈ కొండ ప్రాంతంలో విదేశీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దీనిని 'పరంగి మలై'  (తమిళంలో 'పరంగి' అంటే పాశ్చాత్యులు, 'మలై' అంటే కొండ అని అర్థం) అని పిలిచేవారు. సుమారు 300 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండపై క్రీస్తు శకం 1523 వ సంవత్సరం పోర్చుగీసు వాళ్ళు తోమా స్మారకం గా చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడే తోమా మరణించడంతో ఈ కొండకు అప్పట్లో ఆయన పేరుతోనే సెయింట్ (పవిత్ర) థామస్ మౌంట్ అని పిలిచారు. ప్రస్తుతం ఆ పేరు స్థిరపడిపోయింది.  ఇక్కడి ఆలయాన్ని 1548 వ సంవత్సరం పెద్ద ఆలయంగా అభివృద్ధి చేశారు.

ఆలయంలోని విశిష్టతలు

లూకా గీసిన చిత్రం 
ఈ ఆలయంలో తోమ ఆస్థి పంజరం అవశేషంలోని ఓ చిన్న పాటి ఎముకని భద్రంగా ఉంచారు. భక్తుల సందర్శనం కోసం దానిని ఓ శిలువ ఆకారం మధ్యలో ఏర్పాటు చేసిన అద్దంలో ఉంచారు. ఆలయంలో కనిపించే బాల ఏసుని ఎత్తుకున్న మరియమ్మ చిత్రపటానికి కూడా ప్రత్యేకత ఉంది. దానిని బైబుల్ ను  రాసినవారిలో ఒకరైన లూకా చిత్రీకరించారు. దానిని మత ప్రచార వ్యాప్తి నిమిత్తం వచ్చే 
రక్తం స్రవించే శిలువ శిల్పం 
సందర్భంలో తోమ తనతో పాటే తీసుకు వచ్చాడు. అలాగే ఆలయంలో కనిపించే శిలువ శిల్పానికి  కూడా ప్రత్యేకత ఉంది. దాని నుంచి రక్తం స్రవించడమే అందుకు కారణం. 1547 వ సంవత్సరం ఆలయ పునరుద్ధరణ సమయంలో దానిని కనుగొన్నారు. ప్రార్థన నిమిత్తం దానిని తోమ స్వయంగా తయారు చేసినట్లు విస్వశిస్తున్నారు. 1558 వ సంవత్సరం, 1704 వ సంవత్సరాల్లో ఆ శిలువ నుంచి రక్తం స్రవించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ శిలువ చిత్రంతో భారత తపాలా  తెలిగ్రాఫ్స్  విభాగం 1972  వ సంవత్సరం  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

అంతర్జాతీయ ఖ్యాతి
రక్త స్రావ శిలువ శిల్పంతో తపాలా స్టాంపు
ఈ ఆలయాన్ని 1986 ఫిబ్రవరి 5 వ తేది అప్పటి రెండో పోప్ జాన్ పాల్ సందర్శించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని అంతర్జాతీయ క్రైస్తవ పవిత్ర స్థలం గా గుర్తించారు. ఈ ఆలయానికి వెళ్ళే మెట్ల దారిలో క్రీస్తు జీవితానికి సంబంధించిన కొన్ని శిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ కొండకు ఆనుకొనే చెన్నై (మీనంబాక్కం) విమానాశ్రయం ఉంది. అలాగే మిలటరీ ఆఫీసర్స్ ట్రైనింగ్ (ఓ.టీ.ఎ) కూడా ఈ కొండ వద్దే ఉంది.